Chapata Mirchi: తెలంగాణలో జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల జాబితా..! 5 d ago

మధ్య తెలంగాణ అగ్రో క్లైమాటిక్ జోన్లో పండించే ప్రత్యేక రకం వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. ఈ గుర్తింపు తెలంగాణ నుంచి 18వ జీఐ ట్యాగ్ మరియు ఉద్యానవన ఉత్పత్తికి సంబందించి ఇది మొదటిది. వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోదన కేంద్రం, కొండా లక్ష్మణ్ వర్సిటీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తులు చేశాయి.
పంట సాగు ప్రత్యేకత:
ఈ పంట ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక నేలలు, వాతావరణ అనుకూలతల వల్ల సాగవుతోంది. ఈ మిరపకాయలు లావుగా, ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి టమాటా ఆకారంలో ఉండటం వల్ల వీటిని 'టమాటా మిరపకాయ' అని కూడా పిలుస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో 20 వేల మందికి పైగా రైతులు ప్రతి ఏడాది దాదాపు 7 వేల ఎకరాల్లో 10 వేల టన్నులకు పైగా చపాటా మిర్చిని ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణలో అనేక రకాల ఉత్పత్తులకు GI ట్యాగ్ లభించింది. ఇది తెలంగాణ సంస్కృతి, కళా నైపుణ్యం, వ్యవసాయ వైవిధ్యాన్ని తెలియజేస్తుంది.
తెలంగాణ నుంచి జీఐ ట్యాగ్ పొందినవి:
పోచంపల్లి ఇక్కత్ చీరలు - 2005, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ - 2007, చేర్యాల్ పెయింటింగ్స్ - 2008, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ - 2009, నిర్మల్ ఫర్నిచర్ - 2009 , హైదరాబాద్ హలీమ్ - 2010, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ - 2010, గద్వాల్ చీరలు - 2012, సిద్దిపేట గొల్లభామ చీరలు - 2012, నారాయణపేట చేనేత చీరలు - 2013, పుట్టపాక తెలియా రుమాల్ - 2015, బనగానపల్లె మామిడి పండ్లు - 2017, ఆదిలాబాద్ డోక్రా మెటల్ - 2018, వరంగల్ తివాచీలు - 2018, నిర్మల్ పెయింటింగ్స్ - 2019, తాండూర్ రెడ్ గ్రామ్ (ఎర్ర పప్పు) - 2022, హైదరాబాద్ లక్ గాజులు - 2024, వరంగల్ చపాటా మిర్చి - 2025.
ఈ 14 ఉత్పత్తులు తెలంగాణ యొక్క చేతివృత్తులు, వస్త్రాలు, వ్యవసాయం, ఆహార రంగాల్లోని వైవిధ్యాన్ని తెలియజేస్తాయి. హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు వంటి మరికొన్ని ఉత్పత్తులకు కూడా GI ట్యాగ్ కోసం దరఖాస్తు చేయగా..అవి పెండింగ్‌లో ఉన్నాయి. 2025 చివరి నాటికి GI ట్యాగ్ పొందిన ఉత్పత్తుల సంఖ్యను 27కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరంగల్ చపాటా మిర్చికి GI గుర్తింపు లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.